ఉపోద్ఘాతము

http://latelugu.com/index.php/devotional/1532-moksham-ela

మనం చేసే అన్ని కర్మలు ఆగామి కర్మలే. ఈ కర్మలను చేసేటప్పుడు ఒక్కొక్కసారి కర్మఫలం అనుభవించేస్తాము. కొన్నిసార్లు అవి సంచితములు అవుతాయి. కర్మలు చేసిన తర్వాత కర్మఫలము అనుభవించక తప్పదు. కానీ కర్మలు చేస్తూ కర్మఫలం మనకు రాకుండా ఉండడం ఎలాగో భగవద్గితలో శ్రీకృష్ణ పరమాత్ముడు చాల చక్కగా చెప్పాడు.

కర్తృత్వాభిమానం లేకుండా కర్మలు చెయ్యడం
నిష్కామంగా, ఫలాసక్తి లేకుండా కర్మలు చెయ్యడం
లోక కళ్యాణం కొరకు కర్మలు చెయ్యడం
భగవద్ ప్రీతి కొరకు కర్మలు చెయ్యడం
ఈశ్వరార్పితముగా కర్మలు చెయ్యడం

కర్మ ఎవరు చేస్తే వాళ్ళకే కర్మ ఫలముకూడా. అయితే నేను కర్తని అనిగాక నేను కేవలం కర్మను చేస్తున్నవాడిని - కర్త పరమాత్మ అని ఎల్లవేళలా కర్మను చేస్తే ఆ కర్మఫలము మనకి రాదు. కనుక కర్తృత్వభావనతో కాక కర్తవ్య భావనతో కర్మను చెయ్యాలి. ఉదాహరణకు నువ్వు హత్య చేస్తే ఆ కర్మఫలము నీదే. కానీ ఒక తలారీ ఉరితీస్తే ఆ కర్మఫలం అతనిది కాదు. నేను పరమాత్మా చేతిలో ఒక సాధనాన్ని మాత్రమే అనే ధ్యాస మనసులో ఎల్లప్పుడూ ఉండాలి. ఆలా అని దీనిని స్వార్ధానికి ఉపయోగించరాదు. ఉదాహరణకు ఇంట్లో చక్కటి పూలు పూస్తే అవి పెంచింది ఎవరు అంటే "నేను" అని గర్వంగా చెప్పి, ఒక కుక్క ఆ పూలను పాడుచేస్తుంటే దానిని కొట్టబోతే అది ప్రాణమే విడిస్తే అది మాత్రం దైవ సంకల్పమని మెట్టవేదాంతం చెప్పకూడదు.

ఫలితము ఆశించి ఏ పని అయినా చేస్తే ఆ పని యొక్క కర్మఫలము మనకే వస్తుంది. మంచి పనులకు పుణ్యం వచ్చి దేవా లోకములలో జన్మించి పుణ్య కర్మను అనుభవించి మల్లి తిరిగి జన్మిస్తాము. దేవలోకం కర్మ భూమి కాదు. కేవలం భోగ భూమి. దేవలోకమునకు వెళ్లడం కేవలం కాలం వృధా చేసుకోవడమే కాక మరేమి లేదు. అందుకే పూజ చేసిన తరువాత - "సర్వం నారాయణాయేతి సమర్పయామి" అని చెప్తారు. కర్మ చెయ్యి (పూజ చెయ్యి) ఫలమును ఆశించకు.

శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు - కర్మ చెయ్యి - ఫలితము ఆశించకు. దీనిని మనం స్వార్ధానికి ఉపయోగించరాదు.

కర్మణ్యే వాడి కారస్తే మాఫలేషు కదాచన
మాకర్మ ఫల హేతుర్భూహు మాతేసంగోస్త్వకర్మణి ||

సంతానాపేక్షతో పుణ్యక్షత్రాలకు వెళ్లడం, బాగా డబ్బు రావాలని లక్ష్మి పూజలు, వుద్యోగం రావాలని తలనీలాలులాంటివి కామ్య కర్మలు. ఇలాంటి కర్మలు బంధాలకు కారణం. బంధాలకు కారణం కాకుండా ఉండాలంటే నిష్కామంగా కర్మలు చెయ్యాలి. సూర్యుని వెలుగు, చంద్రుని కాంతి, వాయువు గాలి, చెట్ల నీడ , మాహాత్ముల సన్మార్గము ఇవి అన్ని దేనిని ఆశించకుండా చేసే కర్మలు. ఆలా చెయ్యడమే నిష్కామ కర్మ యోగం. ఆలా చేస్తే బంధం ఏర్పడదు.

లోక కళ్యాణం కొరకు చేసే యజ్ఞ యాగాదులు, కర్మలు సంచితములు కావు. అందుకే పెద్దలు కర్మలు చేసే ముందు "లోక కల్యాణార్థం" అని చెప్పి చేస్తారు.

మనం ప్రతిరోజూ చేసే కర్మలు భగవంతునికి అర్పణ చేస్తే ఆ కర్మ ఫలము మనకు రాదు. పిండి వంటలు చేసి భగవంతునికి అర్పణ చేసి తింటే అది ప్రసాదమవుతుంది. అలానే మనం చేసే కర్మను చేసే ముందు భగవంతుని తలంచుకొని మొదలుపెట్టి, కర్మ జరుగుతున్నంతసేపు భగవంతుని తలుచుకుంటూ, కర్మ పూర్తి అయినా తరువాత భగవంతునికి ఆ కర్మను అర్పణ చేసి ఆ కర్మ ఫలమును ఆశించక పోతే ఆ కర్మ ఫలం మనకు రాదు. ఎలాంటి బంధాలను కలిగించదు.

ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం
చిత్త సోదకం ముక్తి సాధకం ||

కర్తృత్వాభిమానం లేకుండా కర్తవ్య భావనతో, నిష్కామముగాను, ఫలాసక్తి లేకుండా, లోక రహితముగాను, భగవద్ప్రీతికరముగాను, ఈశ్వరార్పితముగాను కర్మలు చేసే విధానమే "కర్మ యోగం".

Search LAtelugu