ఉపోద్ఘాతం

http://latelugu.com/index.php/devotional/1535-karmalu-ela-cheyyali

జీవుడు తన శరీరమును చాలించినప్పుడు మిగిలిన ఆగామి కర్మ ఫలములను సంచితములు అని అంటారు. ఆ సంచితములలో ఏవైతే పక్వానికి వస్తాయో వాటిని ప్రారంభ కర్మ ఫలములు అని పిలుస్తారు. జీవుడు ఈ ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి అనువైన మరొక దేహమును వెతుక్కుంటూ మళ్లీ ఈ లోకంలోకి వచ్చిపడతాడు. ఆలా వచ్చినవాడు ప్రారబ్ధ కర్మలను అనుభవించవలసిందే. ఆలా అనుభవిస్తేనే ఆ ప్రారబ్ధ కర్మలు ఖర్చుఅవుతాయి.

ఎంత గొప్పవారైనా, ఎంతటి మహానుభావులైన, ఎంతటి పుణ్యాత్ములేన, దైవభక్తులైన ప్రారబ్ధ కర్మ ఫలములను అనుభవించక తప్పదు. ప్రారబ్ధ కర్మలు ధనుస్సు నుండి విడిచిన బాణముల వంటివి. ఎక్కడైనా, ఎవరికైనా తగలవలసిందే తప్ప వెనక్కి తిరిగి తెచ్చుకోలేము. మనం ఎక్కడికి వెళ్లినా ఈ పాట్లుపడినా ప్రారబ్ధ కర్మలను వదలలేమని వేమన చెప్పనే చెప్పారు.

ఎన్ని చోట్ల తిరిగి ఈ పాట్లు పడినను అంటనీయక శని వెంట తిరుగు
భూమి క్రొత్తదైనా భుక్తులు క్రొత్తవా విశ్వదాభిరామ వినురవేమ

రామాయణములో భరతుడు రాముడు అరణ్యమునకు వెళ్లిన విషయమును తెలుసుకొని దుఃఖిస్తూ వశిష్ఠుని దగ్గరకు వెళ్తాడు. వశిష్ఠుడు భరతుని ఓదారుస్తూ "సంతోషం, దుఃఖం, సుఖం, చావు, పుట్టుక, కీర్తి, అపకీర్తి అన్ని ప్రారబ్ధ వశమై ఉంటాయి. అవి ఎలా నిశ్చాయింపబడి వుంటాయో ఆలా వాటిని అనుభవించవలసిందే". అని అన్నారు.

మనం రామాయణం గమనిస్తే - శబరి జీవితమంతా రాముని చూడాలని కోరికతో ఉంటే ఆమె చివరి క్షణంలో రాముడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. కౌసల్యకు చాలాకాలం పిల్లలు పుట్టలేదు. తరువాత రాముని కొంతకాలం చూసుకుంది. వెంటనే పుత్రవియోగం. అదే సమయంలో భర్త మరణం. ఇదే ప్రారబ్ధం.

అహల్యకు శ్రీరాముని పాదస్పర్శతో జన్మ వస్తే - దశరధునకు పుత్రవియోగంతో మరణం సంభవించింది. కన్నతండ్రికి చావు ఎక్కడో వున్నా అహల్యకు జన్మ - ప్రారబ్ధం.

శ్రీరాముని భార్యను అపహరించినవాడు రావణుడు. కాపాడవలసినది అయోధ్య. కానీ కాపాడింది వానర సైన్యం. కీర్తి వానరులకు మరి అపకీర్తి? ప్రారబ్ధం.

చిన్నతనంనుండి కైక శ్రీరాముని ఎంతో ప్రేమగా పెంచి పట్టాభిషేకసమయానికి శ్రీరాముని వనవాసమునకు పంపి ఎంతో అపకీర్తిని సంపాదించుకుంది. - ప్రారబ్ధం.

ఇలాంటి కస్టాలు సుఖాలు వచ్చినప్పుడు మనం ధైర్యంతో వాటిని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. అనుభవించేటప్పుడు ఋణం తీరిపోతోంది అని సంతోషించాలి. చేసిన కర్మలు ఖర్చు అయిపోతున్నాయి అన్న భావనలో ఉండాలి. అప్పు తీరిపోతోంది అని ఆనందించాలి. కష్టంలో కూడా ఎలా సంతోషంగాఉండాలి అన్న ప్రశ్నకు భాగవద్గితలో సమాధానం దొరుకుతుంది.

పరమాత్మపై భక్తితో నామస్మరణా చేస్తూ, భగవద్చింతన చేస్తూ, ఆయనపై భారం వేసి ప్రారబ్ధకర్మ ఫలములను అనుభవించాలి అని చెప్పారు. కస్టాలు దుఃఖాలు కలకాలం వుండవు. కష్టముల తరువాత సుఖములు వస్తాయి - ఇదే శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి యోగం.

ఒక పిల్లవాడు కొత్త సైకిల్ తొక్కుతూ కిందపడి దెబ్బతగిలింది. వెంటనే వెళ్లి వైద్యం చేయించి పడుకోబెట్టి సమయానికి అన్ని మందులు వాడగలం. కానీ ఆ నెప్పి మాత్రం ఆ పిల్లవాడు అనుభవించాల్సిందే. ఆ నెప్పిని మనం తీసుకోలేము. మన ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి వేరెవరో వుండరు. మనమే అనుభవించాలి. కానీ భక్తితో భగవంతుని ఆశ్రయిస్తే ఆ కష్టములను భరించగలిగే శక్తిని భగవంతుడు ఇవ్వగలడు.

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu