ఆది శంకరులు మనిషి ఎలా ఉండాలో భజ గోవిందం ద్వారా కొట్టినట్లు తెలియచేసారు. వాటిలో కొన్ని....

 • గోవిందుని భజించు. నీవు పాఠశాలలో నేర్చుకున్న విద్యాబుద్ధులు నీకు ధనార్జనకే తప్ప మోక్షమునకు పనికిరావు. 
 • ధనసంపాదన మీద ఆశ విడిచిపెట్టు.
 • నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు.
 • ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు.
 • ధనమున్నదని, పరిచారకులు వున్నారని, యౌవనం ఉన్నదని గర్వించకు. అవన్నీ నశించేవే. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు.
 • డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం.
 • ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే.
 • తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది.
 • ఈ మానవ జీవితం అంతా రోగాలతో నిండి ఉంటుంది. నేను నాది అన్న మమకారంతో వున్నది.
 • దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు.
 • ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు.
 • శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ శవమును చూసి భార్య కూడా భయపడుతుంది. 
 • స్త్రీల సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు.
 • శరీర సౌందర్యం మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.
 • మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. 
 • మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. యౌవనం లో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ అన్ని సమయములలోను పరమాత్మ యందు ఆసక్తిని కలిగి ఉండాలి.
 • సమస్త దుఃఖాలకు ఈ మానవ జీవితము ఆలవాలం.
 • ఎప్పటికప్పుడు - నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? అని ఈ సంసారం గురించి నిరంతరం విచారణ చేస్తూ ఉండాలి.
 • శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని, బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు. 
 • సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది.
 • సత్పురుషులతో సాంగత్యం మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. 
 • కాలం నడిచిపోయినట్లుగా మానవుడు ఆశను వదిలివేయాలి.
 • మొహం నశిస్తే సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.
 • నీరంతా ఇంకిపోయిన తరువాత ఎలా అయితే సరస్సు ఉండదో అలాగే వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.
 • ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.
 • ఎన్ని పూజలు చేసినా - ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడు.

ఈ ప్రపంచమంతా మాయ, భ్రమతో కూడుకున్నది, ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు.

మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కేవలం భగవంతుడే మనల్ని సంసార చక్రమునుండి తప్పిస్తాడు. ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక.
ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు.

సత్యాన్ని దర్శించు. ఆశలను కోరికలను వదిలిపెట్టు. పరమాత్మను గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు. ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు. కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు.

భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి.

క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు.

గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించు. నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక!

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu